కమేడియన్ అవుతానని అనుకోలేదు: రఘుబాబు

Posted On:01-07-2015
No.Of Views:303

చిత్రపరిశ్రమ నిజంగానే చిత్రాలు చేస్తూ వుంటుంది. ఎందుకంటే, ఇక్కడికి కథానాయకులు కావాలని వచ్చిన వాళ్లు నిర్మాతలుగా మారిపోతుంటారు. నిర్మాతలుగా అడుగుపెట్టినవాళ్లు దర్శకులుగా మారిపోతుంటారు. ఎవరు ఏ ఆశయంతో వచ్చినా .. వాళ్లు ఏం కావాలనేది నిర్ణయించేది తాను అన్నట్టుగా చిత్రపరిశ్రమ ఊహించని విచిత్రాలు చేస్తుంటుంది. అలాంటి చిత్రమైన అనుభవాన్ని పొందినవాడుగా 'రఘుబాబు' కనిపిస్తుంటాడు. తాను హాస్యనటుడిని అవుతానని రఘుబాబు ఎప్పుడూ అనుకోలేదట. వెండితెరపై కనిపించాలనే ఆరాటం కూడా ఆయనకి ఎప్పుడూ వుండేది కాదు. అయితే ఆయనలో సహజంగా వున్న సమయస్ఫూర్తి .. ఆకట్టుకునే మేనరిజం చూసి సినిమాల్లో ప్రయత్నించమని స్నేహితులు చెబుతూ వుండేవాళ్లట. ఇక ఆయన తండ్రి గిరిబాబు కూడా .. మరో కుమారుడు బోస్ బాబు హీరో అవుతాడని అనుకున్నాడటగానీ, రఘుబాబు హాస్యనటుడు అవుతాడని అనుకోలేదట. రఘుబాబు కూడా తనపై అభిమానంతో స్నేహితులు అలాగే అంటారని భావించి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. నిర్మాతగా స్థిరపడిపోదామనే ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే అనుకోకుండా వచ్చిన ఒక చిన్న వేషం ఆయనని పెద్ద కమేడియన్ గా మార్చేసింది. కెరియర్లో వెనక్కితిరిగి చూసుకోలేనంతగా బిజీ చేసింది. వైవిధ్యభరితమైన మేనరిజంతో కమెడియన్ గా ఆయన శభాష్ అనిపించుకున్నాడు. రఘుబాబుకి ఓ పాత్ర ఉండాల్సిందేనని దర్శకనిర్మాతలు ముందుగానే ఫిక్సై పోయేంత గుర్తింపును సొంతం చేసుకున్నాడు.