రాష్ట్ర విద్యార్థుల ర్యాంకులు గల్లంతు

Posted On:01-07-2015
No.Of Views:250

హైదరాబాద్: జాతీయస్థాయి విద్యా సంస్థలైన ఎన్, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌కు సంబంధించి వేలాది మంది రాష్ట్ర విద్యార్థుల ర్యాంకులు గల్లంతయ్యాయి. బుధవారం మధ్యాహ్నం అందుబాటులోకి వచ్చిన ఈ ఫలితాల్లో చాలా మంది విద్యార్థులకు ర్యాంకులను కేటాయించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో వెయిటేజీ కోసం ఇంటర్ మార్కులను పంపడంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు చేసిన పొరపాటే దీనికి కారణమంటూ బుధవారం రాత్రి ఇంటర్‌బోర్డు, సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు.అయితే దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జేఈఈ పరీక్షలను నిర్వహించిన సీబీఎస్ ఈతో మాట్లాడుతామని, అధికారులను ఢిల్లీకి పంపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను ఖరారు చేస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు విద్యార్థుల మార్కుల వివరాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు (సీబీఎస్ఈ)కు పంపించాలి. అనంతరం ర్యాంకులను సీబీఎస్ఈ ప్రకటిస్తుంది. కానీ ఈసారి వేలాది మంది రాష్ట్ర విద్యార్థులకు జేఈఈ మెయిన్ ర్యాంకులను కేటాయించలేదు. తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కులను పంపడంలో చేసిన పొరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.మరోవైపు తాము విద్యార్థులందరి మార్కులను సీబీఎస్ఈకి పంపించామని, అక్కడే ఏదో సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏదైనా ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం సాయంత్రమే ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించారు. అయితే తాము సీబీఎస్ఈతో మాట్లాడుతున్నామని అధికారులు చెబుతున్నారే తప్ప స్పష్టత ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే తమ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందంటూ ఇంటర్ బోర్డు,సచివాలయం వద్ద బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. మరోవైపు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కులను కూడా ఇంటర్ బోర్డు సీబీఎస్ఈకి పంపకపోవడంతో విద్యార్థులకు ర్యాంకులను కేటాయించలేదని కొంతమంది తల్లిదండ్రులు వాపోతున్నారు.