నేటి నుంచి దేశవ్యాప్తంగా మొబైల్ నెంబరు ఒక్కటే!

Posted On:02-07-2015
No.Of Views:305

 దేశంలో ఎక్కడైనా మొబైల్ నెంబరు మారకుండా, నెట్‌వర్క్ సంస్థను మార్చుకునేందుకు వీలు కల్పించే జాతీయస్థాయి మొబైల్ నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సేవలు ప్రారంభించేందుకు ఈనెల 3 వరకు ప్రభుత్వం ఆపరేటర్లకు ప్రభుత్వం సమయం ఇచ్చింది. సరిగ్గా గడువు తేదీ (శుక్రవారం) నుంచే జాతీయస్థాయి ఎంఎన్‌పీ సేవలకు శ్రీకారం చుడుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ప్రకటించాయి. యునినార్, వీడియోకాన్, ఎంటీఎస్ (సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్) వంటి సంస్థలూ సిద్ధమవుతున్నాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఖాతాదారులంతా, ఈ సేవలు వినియోగించుకోవచ్చు. ఇప్పటివరకు ఒక టెలికాం సర్కిల్ పరిధిలోని మొబైల్ ఖాతాదారులు, వినియోగిస్తున్న నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారినా, మొబైల్ నెంబరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎంఎన్‌పీ అమలవుతోంది. ఇకపై ఇతర టెలికాం సర్కిల్ (రాష్ట్రం) పరిధిలోకి వెళ్లినా, నెంబరు మారకుండానే, అక్కడ నెట్‌వర్క్ బాగున్న, నచ్చిన ఆపరేటర్ సేవలు పొందవచ్చు.
ఎయిర్‌టెల్ ఆఫర్లు: టెలికాం సర్కిల్ మారినా, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌నే కొనసాగించే ఖాతాదారులకు 24 గంటలలోనే పోర్టింగ్ కల్పిస్తారు. అంటే మారిన సర్కిల్ పరిధిలోకి ఈ నెంబరు బదిలీ అవుతుంది. ఈ ప్రక్రియ జరిగేవరకు రోమింగ్ ఛార్జీలు లేకుండా, ఉచితంగా ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చు. ప్రీపెయిడ్ ఖాతాదారుల బ్యాలన్స్ బదిలీ అవుతుంది.ఐడియా: ఆయా సర్కిళ్ల పరిధిలోనే ఇతర ఆపరేటర్ల నుంచి ఎంఎన్‌పీ ద్వారా ఇప్పటికే 1.40 కోట్ల మంది ఖాతాదారులు తమ నెట్‌వర్క్‌ను ఎంచుకున్నారని ఐడియా సెల్యులార్ తెలిపింది. జాతీయస్థాయి ఎంఎన్‌పీ కోసం టోల్‌ఫ్రీ నెంబరు 18002700000కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ప్రకటించింది.