అమెరికాలో తెలుగు సందడి షురూ..

Posted On:02-07-2015
No.Of Views:288

అమెరికాలోని రెండు జాతీయ స్థాయి ప్రవాస తెలుగు సంఘాలు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్‌) తమ ద్వైవార్షిక మహాసభలను గురు, శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్నాయి. తానా 20వ మహాసభలను డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్‌, అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ నేతృత్వంలో నిర్వహిస్తుండగా.. నాట్స్‌ 4వ మహాసభలు లాస్‌ఏంజెలెస్‌లోని అనహేం కన్వెన్షన్‌ సెంటర్‌లో సమన్వయకర్త ఆలపాటి రవి నేతృత్వంలో జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం విందు కార్యక్రమంతో రెండు చోట్లా వేడుకలు మొదలయ్యాయి.
తానా సభలకు...తానా సభల్లో పాల్గొనేందుకు ఇప్పటిదాకా.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణ, ఏపీ శాసనసభాపతి డాక్టర్‌ కోడెల, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, అయ్యన్న పాత్రుడు, కాకినాడ ఎంపీ తోట నర్సింహులు, సినీ ప్రముఖుల్లో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి తాప్సీ, నటులు శ్రీకాంత్‌, నవదీప్‌, ప్రిన్స్‌, శివాజీ, ఖయ్యూం, రవిబాబు, స్టార్‌ హాస్పిటల్స్‌ అధినేత గోపీచంద్‌, నిర్మాత కె.ఎల్‌ నారాయణ, కాంప్యూటెక్‌ సీఈవో కంచర్ల రామకృష్ణ, ఫ్యాప్సీ మాజీ అధ్యక్షుడు అట్లూరి సుబ్బారావు తదితరులు అమెరికాకు చేరుకున్నారు. 
నాట్స్‌ సంబరాలకు..నాట్స్‌ సంబరాల్లో పాల్గొనేందుకు.. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, గ్రంథి మల్లికార్జున రావు, పీపీ రెడ్డి, జస్టిస్‌ నూతి రామ్మోహన్‌రావు, జస్టిస్‌ శేషసాయి, నిమ్మగడ్డ ప్రసాద్‌, త్రిష, కాజల్‌ అగర్వాల్‌, నిషా అగర్వాల్‌, విమలా రామన్‌, కమలిని ముఖర్జీ, అనూప్‌ రూబెన్స్‌, వందేమాతరం, సిరాశ్రీ, గజల్‌ శ్రీనివాస్‌, తనికెళ్ల భరణి, గీతామాధురి, భాస్కరభట్ల, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు ఇప్పటికే చేరుకున్నారు. కాగా, తానా ప్రారంభోత్సవంలో పాల్గొనే అతిథులు నాట్స్‌ ముగింపు వేడుకలకు, నాట్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనే ప్రముఖులు తానా ముగింపు ఉత్సవాలకు హాజరయ్యేలా, రెండు సభలకూ హాజరయ్యే తెలుగువారందరితో సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.