కారు ప్రమాదంలో హేమమాలినికి గాయాలు

Posted On:02-07-2015
No.Of Views:289

జైపూర్: సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మధుర నుంచి జైపూర్ వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు దౌసా వద్ద ఎదురుగా వస్తున్న ఆల్టో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆల్టోలో ప్రయాణిస్తున్న నాలుగేళ్ల బాలిక సోనమ్ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హేమమాలినికి కుడి కనుబొమ్మ వద్ద గాయమైంది. ముఖమంతా రక్తసిక్తమైంది.జైపూర్లోని ఫోర్టిస్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. కారులో నుంచి దిగి ఆమె స్వయంగా ఆసుపత్రిలోకి నడుచుకుంటూ వెళ్లారు. కనుబొమ్మ వద్ద కుట్లు వేశారని, స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వెన్నెముక, కాళ్లకు కూడా స్వల్ప గాయాలయినట్లు తెలుస్తోంది. ఆమె బాగానే ఉన్నారని సన్నిహితులు చెప్పారు.మధుర లోక్సభ స్థానం నుంచి ఎంపికైన హేమమాలిని గురువారం మధుర నుంచి జైపూర్కు వెళుతుండగా... దౌసా వద్ద రాత్రి 8:50 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్టో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఒక పురుషుడు ప్రయాణిస్తున్నారని, ఇందులో ఒకపాప చనిపోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని దౌసా జిల్లా కలెక్టర్ స్వరూప్ పన్వర్ తెలిపారు.