రేపు ఉదయానికల్లా ర్యాంకులు: కడియం

Posted On:02-07-2015
No.Of Views:216

 హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకుల గల్లంతు సమస్య పరిష్కారమైంది. ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులు రోజంతా శ్రమించి గల్లంతైనవారికి సైతం ర్యాంకులివ్వటానికి సీబీఎస్ఈని ఒప్పించారు. మొత్తం 1188మంది మార్కులు తెలంగాణ ఇంటర్‌బోర్డు నుంచి సీబీఎస్ఈకి చేరలేదని గుర్తించారు. వీరందరికీ నాలుగోతేదీ ఉదయానికల్లా ర్యాంకులు కేటాయిస్తారు. నాలుగైదు తేదీల్లో ఐచ్ఛికాలు(వెబ్ఆప్షన్లు) పెట్టుకునే వీలుంటుంది. పాత ర్యాంకర్లకు ఇబ్బందిలేకుండానే కొత్తగా ఫ్రాక్షనల్ ర్యాంకులు కేటాయించాలని కేంద్రీయ సీటుకేటాయింపు మండలి (సీఎస్ఏబీ) అధికారులు సీబీఎస్ఈకి సూచించారు. ఉదాహరణకు కొత్తగా వచ్చే అభ్యర్థిర్యాంకు 100, 101మధ్యలో ఉంటే 100.1గా కేటాయిస్తారు. తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డా|| అశోక్ సమాచారమంతా తీసుకొని గురువారం ఉదయమే హుటాహుటిన ఢిల్లీవెళ్ళారు. సీబీఎస్ఈ ఛైర్మన్ సత్బీర్‌బేడీని కలిసి మాట్లాడారు. కానీ మార్పులుచేర్పులకు ఆమె అంగీకరించలేదని తెలిసింది. దీంతో మానవవనరుల మంత్రిత్వశాఖ పాఠశాల విభాగం కార్యదర్శి సుభాష్ కుంతియా జోక్యంచేసుకొని, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వ్యవహరించాలని సూచించారు. అయినా వినకపోవటంతో కుంతియా రాతపూర్వక ఆదేశాలివ్వటంతో సీబీఎస్ఈ ర్యాంకులివ్వటానికి అంగీకరించిందని సమాచారం. ర్యాంకులిచ్చే దాకా తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను ఢిల్లీలోనే ఉండాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు.