జయపై కరుణ ఫైర్

Posted On:04-07-2015
No.Of Views:276

 చెన్నై నగరంలో ట్రాఫిక్ రద్దీ సమస్యకు పరిష్కారంగా మెట్రోరైలు సేవలు ప్రవేశించాయి. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాల హయాంలో మెట్రో పనులు ప్రారంభం, పూర్తికావడం, ప్రారంభానికి నోచుకోవడం జరిగింది. అయితే మెట్రోరైలు సేవలు ప్రారంభమై వారం రోజులు కావస్తున్నా నగర ప్రజలకు సౌకర్యాన్ని చేకూర్చిందా లేదా అనే అంశమే చర్చకు రాలేదు. నగరంలో 45 కిలో మీటర్ల దూరం పరుగులు పెట్టేలా రూపొందిన మెట్రోరైలు పథకంలో తొలి విడతగా కేవలం 10 కిలో మీటర్ల ప్రయాణం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. 10 కిలోమీటర్లకు రూ.40 గా టిక్కెట్లు చార్జీలు నిర్ణయించడం విమర్శలకు దారితీసింది.
మెట్రో ప్రయాణం బాగున్నా చార్జీలు మాత్రం భారమంటూ వచ్చిన విమర్శలకు సహజంగానే ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా స్పందించింది. ఇదే అదనుగా అధికార అన్నాడీఎంకేను దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది. పథకానికి శ్రీకారం చుట్టింది తామైనా చార్జీల నిర్ణయం డీఎంకే హయాంలోనే జరిగిందని కరుణ విమర్శలను జయ తిప్పికొట్టారు. దీంతో తీవ్రంగా మండిపడిన కరుణ శుక్రవారం ఒక ప్రకటనలో జయపై విరుచుకుపడ్డారు.
అన్నాడీఎంకేనే మెట్రో పథకానికి అంకురార్పణ చేసిన పక్షంలో ఎపుడు శంకుస్థాపన జరిగిందో తేదీ చెప్పగలరా అంటూ కరుణ నిలదీశారు. 2006లో డీఎంకే ప్రభుత్వం రాగానే తన నేతృత్వంలో మెట్రోకు నిర్ణయం జరిగింది, 2007 నవంబరు 1న అధికారిక ప్రకటన, 7 వ తేదీన మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం జరిగిందని కరుణ చెప్పారు. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో పనులను ఆపేందుకు విఫలయత్నం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ మెట్రో పనులకు శంకుస్థాపన చేశారని ఆయన తెలిపారు.
చార్జీల బాధ్యత ప్రభుత్వానిదే: బీజేపీ
మెట్రో చార్జీల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. చార్జీల భారం వల్ల మెట్రోరైలు పట్ల ప్రజల్లో విముఖత ఏర్పడిందని అన్నారు. చార్జీలను తగ్గించే అధికారాన్ని వినియోగించి ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని రాష్ట్రప్రభుత్వానికి వారు హితవు పలికారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేలు శరత్కుమార్, కృష్ణస్వామి శుక్రవారం మెట్రోరైలులో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చార్జీల భారం మాత్రమేకాదు ఇందులోని వసతులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని శరత్కుమార్ అన్నారు.