రిషితేశ్వరి మృతిపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలి

Posted On:31-07-2015
No.Of Views:285

రిషితేశ్వరి మృతికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదంతంపై స్పందించి బాధ్యులైన వారిని తక్షణం అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయం జరగని పక్షంలో విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి చెందిన రిషితేశ్వరి మృతిపై న్యాయ విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ల నేతృత్వంలో విద్యార్థులు శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశాలు జరుగుతున్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. క్యాంపు కార్యాలయానికి వెళ్ళే ప్రధాన ద్వారాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా విద్యార్థులు సివిల్‌ కోర్డుల దగ్గర సమీకరణ అయ్యారు. అక్కడి నుంచి ప్రదర్శనగా సీఎం క్యాంపు కార్యాలయం వైపుగా వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన గేటు దగ్గర పోలీసులు సాధారణ భద్రతనే కల్పించారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా లేరు. దీంతో విద్యార్థులు ఒక్క ఉదుటున బ్యారికేడ్లను చేధించుకుని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. ఈ దశలో లోపల ఉన్న పోలీసులు పరిగెత్తుకువచ్చి బ్యారికేడ్లను చేధించకుండా అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు బ్యారికేడ్ల వెలుపలే ధర్నా తలపెట్టారు. ప్రిన్సిపల్‌ బాబూరావును, ర్యాగింగ్‌కు పాల్పడిన సహ విద్యార్థులు, ఒత్తిడి తీసుకు వచ్చిన విద్యార్థినులను తక్షణం అరెస్టు చేయాలని పెద్ద పెట్టున నినందించారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించటం లేదని.. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వంపై విద్యార్థులు విమర్శలకు దిగటంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయబోయారు. విద్యార్థులను అరెస్టు చేయటం పోలీసులకు తలకు మించిన భారమైంది.బలవంతంగా అదుపులోకి తీసుకున్న విద్యార్థులను పోలీసు స్టేషన్లకు తరలించటానికి వాహనాలు లేవు. ముందస్తుగానే వ్యాన్లను అందుబాటులో ఉంచుకోవటంలో పోలీసులు వైఫల్యం చెందారు. చాలా సేపు విద్యార్థులతో పోలీసులు పెనుగులాడటమే సరిపోయింది. మరోవైపు విద్యార్ధులంతా పోలీసులు అరెస్టు చేయటానికి వీలు లేకుండా ఒకరినొకరు కాళ్ళు చేతులు పట్టుకుని నేలపై పడుకుని నినాదాలు చేయటం ప్రారంభించారు. వాహనం కోసం ఎదురు చూసిన పోలీసులు ఓ ట్రక్‌ ఆటోను తెప్పించి విద్యార్థులను కొంతమందిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇంకా సగం మంది నేలపైన పడుకుని నినాదాలు ఇస్తుండటంతో మరో వాహనాన్ని కొద్దిసేపటికి తీసుకు వచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామ్మోహన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, ఎం.మహేష్‌లతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బి.సిద్దూ, టి.ప్రవీణ్‌, జె.అశోక్‌, వసంత్‌, రాజేష్‌, శాం్యసన్‌, రాణి, జ్యోతి, రఘువీర్‌, కోటి తదితర విద్యార్థులందరినీ పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.