అబ్దుల్ కలాం పేరుతో అవార్డు..

Posted On:31-07-2015
No.Of Views:229

చెన్నై: భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరుతో ప్రతి ఏటా అవార్డును అందజేయనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రకటించారు. శాస్త్రీయ విజ్ఞానంలో ఉన్నత ఫలితాలు సాధించిన వారు, విద్యార్థుల ఉన్నతికి శ్రమిస్తున్న వారు, మానవతావాదిగా నిలిచిన వారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందజేయనున్నట్లు ఆమె తెలిపారు.
అవార్డుతో పాటు 8 గ్రాముల బంగారు పతకం, రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తామని వెల్లడించారు. ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున అవార్డును బహూకరిస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచే అవార్డు బహూకరణను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారతరత్న అబ్దుల్ కలాం జయంతి అక్టోబర్ 15ని తమిళనాడు ప్రభుత్వం యువ చైతన్య దినంగా పరిగణిస్తున్నట్లు సీఎం తెలిపారు.
కలాం బొమ్మతో తపాలా స్టాంపులు
మిస్సైల్&మ్యాన్ అబ్దుల్ కలాం బొమ్మతో నాలుగు స్టాంపులను విడుదల చేయనున్నట్లు తపాలా శాఖ చెన్నై నగర మండల డెరైక్టర్ మెర్విన్ అలెగ్జాండర్ తెలిపారు. అక్టోబర్ 15 కలాం జయంతి రోజున స్టాంపులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.