విజయం కోసమే పరితపిస్తా: భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ

Posted On:02-08-2015
No.Of Views:310

చెన్నై: మూడు టెస్టుల సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ జట్టు త్వరలోనే శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాను కోహ్లీనే నడిపించనున్నాడు. అయితే ఈలోగా ఫామ్‌ను అందుకోవడానికి కోహ్లీ.. ఆస్ర్టేలియా-ఎతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భారత్‌-ఎ తరఫున రెండో టెస్టు ఆడిన కోహ్లీ.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 16, 45 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది పెద్దగా టెస్టు క్రికెట్‌ ఆడకపోయినా.. వన్డేల్లో కూడా విరాట్‌ బ్యాటింగ్‌ అంతంత మాత్రమే..! శతకం సాధించి ఆరు నెలలు గడిచిపోయింది. ఈ నెల 12 నుంచి శ్రీలంక పర్యటన ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటలో మరికొంత దూకుడు పెంచాల్సిన అవసరం ఉందా? అంటే.. ఏమాత్రం అవసరంలేదని కోహ్లీ సమాధానమిచ్చాడు. ‘బ్యాట్స్‌మన్‌గా ఎప్పుడూ బాధ్యతగానే ఉంటాను. జట్టు గెలుపు కోసం నిరంతరం ప్రయత్నిస్తాను. ఈ విషయంలో అదనం అనే దానికి చోటే లేదు. బోర్డు కూడా దీనిని గుర్తించింది కాబట్టే.. నాపై జట్టు భారాన్ని మోపింద’ని కోహ్లీ తెలిపాడు. ఫీల్డింగ్‌లోనైనా, బ్యాటింగ్‌లోనైనా నూటికి నూరు శాతం నిబద్ధతతో ఆడతానని విరాట్‌ అన్నాడు. టీమ్‌ కోసం ఎప్పుడూ బాధ్యతగానే వ్యవహరించా.. దేశం కోసం ఆడినంత కాలం ఇలాగే ఉంటానని కోహ్లీ నొక్కి వక్కాణించాడు. ఇక లంక పర్యటన గురించి మాట్లాడుతూ.. తొలిసారిగా పూర్తి సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నానని అన్నాడు. కొత్త బాధ్యతలు, కొత్త టీమ్‌తో బరిలోకి దిగడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని విరాట్‌ చెప్పాడు. ‘కెప్టెన్‌గా పూర్తిస్థాయి సిరీస్‌. నాతోపాటు జట్టుకు కూడా ఇది సవాలే. ఎంతోమంది యువ క్రికెటర్లు తమ కెరీర్‌కు పునాదులు వేసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నార’ని కోహ్లీ చెప్పాడు. ప్రణాళిక ప్రకారం సిరీస్‌కు సంసిద్ధమై, సానుకూల దృక్పథంతో ఆడితే లంకతో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలమని కోహ్లీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టుపై నమ్మకం ఉందని.. బీసీసీఐ తనపై ఉంచిన బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌-ఎ టీమ్‌ తరఫున ఆడడానికి చెన్నై వచ్చిన కోహ్లీ.. కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఎంతో విలువైన పాఠాలు నేర్పాడని చెప్పాడు.