ఆందోళన చేస్తున్న 27 మంది ఎంపీల సస్పెన్షన్‌

Posted On:03-08-2015
No.Of Views:251

పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సుష్మాస్వరాజ్‌, వసుంధర రాజే, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్‌ సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైనా సభలో అదే పరిస్థితి కొనసాగింది. 
విపక్ష ఎంపీలు స్పీకర్‌ పొడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేసే వరకు సమావేశాలను జరగనివ్వబోమని ఎంపీలు స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలు జరగాలని, అందుకు అందరూ సహకరించాలని సభాపతి ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో ఆందోళన చేపట్టిన 27 మంది ఎంపీలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ నుంచి 5 రోజుల పాటు 377 రూల్‌ ప్రకారం సస్పెండ్‌ చేస్తూ... సభను మంగళవారం నాటికి వాయిదా వేశారు.అంతకుముందు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ పలుమార్లు సభ్యులకు సర్ది చెప్పారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.