మొగుడొద్దు.. కుక్కలే ముద్దు..!

Posted On:09-09-2015
No.Of Views:314

బెంగళూరు: కుక్కలపై పెంచుకున్న విపరీతమైన మక్కువ ఓ యువతి కొత్త సంసారంలో చిచ్చురేపింది. భర్తకు విడాకులైనా ఇస్తా కాని పెంపుడు శునకాలను వదిలేది లేదని తెగేసి చెబుతోంది. వివరాలు.. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఏడాది క్రితం కేరళకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పుట్టింటి నుంచి అత్తారింటికి వస్తూ తనతో పాటు లాబ్రడార్ జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలను తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె శునకాలతోనే ఎక్కువ సేపు గడుపుతుండడం భర్తకు నచ్చలేదు. చివరకు బెడ్రూంలో కూడా శునకాలు తన పక్కనే ఉండాలని ఆమె పట్టుబడుతుండడం వివాదానికి తెరలేపింది. ఈ విషయంలో అబ్బాయికి అతని తల్లి సర్దిచెప్పింది.
    ఏడాది గడిచినా యువతి పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సహనం కోల్పోయిన అబ్బాయి, అతని తల్లి హెచ్ఎస్ఆర్ లే అవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలు కావడంతో నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కౌన్సెలింగ్ కేంద్రానికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో బుధవారం కౌన్సెలింగ్ కేంద్రానికి దంపతులిద్దరూ వెళ్లారు. అక్కడ కూడా తనకు భర్త కంటే పెంపుడు శునకాలంటే ఎక్కువ ప్రేమని యువతి తేల్చి చెప్పింది. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె పట్టు వీడలేదు. ఫలితంగా ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.