రెండు సెకన్లలో బ్రిడ్జిని కూల్చేశారు!

Posted On:10-09-2015
No.Of Views:258

చైనాలో నాలుగు దశాబ్దాల నాటి పాత వంతెన ఒకదాన్ని సరిగ్గా రెండంటే రెండే సెకండ్లలో కూల్చేశారు. మధ్య చైనాలోని షాంగ్జియాజీ నగరంలో గల లిషుల్ బ్రిడ్జిని కూల్చేయడానికి సరిగ్గా ఒక టన్ను పేలుడు పదార్థాలను ఉపయోగించారు. అక్కడ కొత్త బ్రిడ్జి కట్టడం కోసం ఈ పాత బ్రిడ్జిని కూల్చేశారు. ఈ మొత్తం కూల్చివేత ప్రక్రియను వీడియో తీసి, రెండు సెకండ్లలోనే తాము ఎలా కూల్చేశామో టీవీ చానళ్లలో చూపించారు. ఒకే సమయంలో మొత్తం బ్రిడ్జి భాగాలన్నీ దుమ్ము, ధూళి రూపంలోకి మారిపోయాయి. కింద ఉన్న లిషుల్ నదిలోకి కలిసిపోయాయి.
   ఈ బ్రిడ్జి పొడవు 800 అడుగులు. 44 ఏళ్ల క్రితం దీన్ని పూర్తిగా రాళ్లతో నిర్మించారు. దాని చుట్టూ అనేక నివాస, వాణిజ్య భవనాలున్నాయి. దాంతో కూల్చివేత సమయంలో ఎవరూ అక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బ్రిడ్జికి ఉన్న 15 భాగాలకు విడివిడిగా పేలుడు పదార్థాలు, డిటనేటర్లు అమర్చారు.  దానికితోడు 2,888 డైనమైట్ స్టిక్లను ఉపయోగించారు. మొత్తం ప్లాన్ వేయడానికి, అమలుచేయడానికి మాత్రం నెల రోజులు పట్టింది.