ముక్కు కొరికి మింగేశాడు!

Posted On:10-09-2015
No.Of Views:294

    బీజింగ్: ఫోన్ ఎత్తలేదన్న కోపంతో భార్య ముక్కు కొరికి తినేశాడో భర్త. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన చైనాలో డెజ్ హొయు నగరంలో చోటు చేసుకుంది. ఈనెల 6న ఆఫీసు నుంచి సమయానికి రాకపోవడంతో తన భార్యకు భర్త ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన భర్త నేరుగా భార్య పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆమె ముక్కు కొరికేసి మింగేశాడు.  అక్కడితో ఆగకుండా తన తలను గోడకేసి కొట్టాడని బాధితురాలు యాంగ్ స్థానిక మీడియాతో చెప్పింది. అయితే అతడి నుంచి విడిపోయినా ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. బాధితురాలు ముక్కుకి తీవ్రగాయమైందని, శస్త్రచికిత్స చేయాల్సివుంటుందని వైద్యులు తెలిపారు. ముక్కు పూర్వరూపం సంతరించుకోవడానికి కనీసం 3 నెలలు పడుతుందని వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.