పోకిరీలను కరాటే కిక్‌తో తరిమేసింది!

Posted On:10-09-2015
No.Of Views:258

కోల్‌కతా:    ఆమె వయసు 17 సంవత్సరాలు. ఉండేది పశ్చిమబెంగాల్ రాష్ట్రం. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని దోల్తలా బస్టాపు సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను వేధించాలని బయల్దేరారు. కానీ వాళ్లకు అసలు విషయం తెలియదు. ఆమె ఓ కరాటే ఫైటర్. వేధించేందుకు వచ్చిన ఇద్దరికీ ఆమె తనదైన శైలిలో నాలుగు కరాటే కిక్‌లు ఇచ్చి సన్మానం చేసి పంపింది. దాంతో దెబ్బకు వాళ్లిద్దరూ తోక ముడిచి పారిపోయారు. ఆ ధైర్యశాలి పేరు మున్నాదాస్. ఆమె కరాటే క్లాసు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు సైకిళ్ల మీద వస్తూ ఆమెను వేధించారు.    ఒకరు ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. దాంతో ఆమె కింద పడిపోయినా.. వెంటనే లేచి, కాలు గాల్లోకి లేపి ఒక్క కిక్కు ఇచ్చుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమకు రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో రెండు స్వర్ణపతకాలు వచ్చాయి. వాళ్లలో ఒకడి పీక పట్టుకున్నానని, తర్వాత అతడి ముఖం మీద ఓ పంచ్ ఇచ్చానని మున్నాదాస్ తెలిపింది.మెడమీద కొన్ని స్నాప్ కిక్‌లు, కొన్ని గ్రోయిన్ కిక్‌లు ఇవ్వడంతో అతడు పడిపోయాడని, వాళ్లు పారిపోతుంటే మరికొన్ని కిక్‌లు ఇచ్చానని ఆమె తెలిపింది. తన విద్యార్థిని సాహసం చూసి ఆమె కరాటే గురువు భోలానాథ్ షా మురిసిపోయారు. ఆయన కూడా 1996లో జాతీయ స్థాయి బంగారు పతకం సాధించారు. ఈమె రాష్ట్రంలోని వేలాదిమందికి స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు.