సానియా... మళ్లీ సాధించెన్

Posted On:13-09-2015
No.Of Views:312

ఈ ఏడాది అద్వితీయ ఫామ్లో ఉన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్లో మరో గొప్ప విజయం సాధించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా రెండో గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. గత జులైలో హింగిస్;తోనే కలిసి సానియా వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. ఈ టోర్నీలో ఈ ఇండో-స్విస్ జోడీ తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. విజేతగా నిలిచిన సానియా-హింగిస్&zwnj;లకు 5 లక్షల 70 వేల డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 కోట్ల 77 లక్షలు) లభించింది. రన్నరప్ డెలాక్వా-ష్వెదోవా జోడీకి 2 లక్షల 75 వేల డాలర్లు (రూ. కోటీ 82 లక్షలు) దక్కాయి.<br />
   
    ► 70 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంట సమన్వయంతో ఆడింది. తొలి సెట్&zwnj;లో రెండుసార్లు ప్రత్యర్థి జంట సర్వీస్&zwnj;ను బ్రేక్ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్లో సానియా తన సర్వీస్ను నిలబెట్టుకోవడంతో తొలి సెట్&zwnj;ను ఈ ద్వయం 31 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్లోనూ సానియా జోడీ తమ జోరు కొనసాగించింది. మూడుసార్లు తమ ప్రత్యర్థి సర్వీస్&zwnj;లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
    ► ఓవరాల్గా సానియా కెరీర్లో ఇది ఐదో డబుల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్. మహిళల డబుల్స్&zwnj;లో మార్టి నా హింగిస్తో కలిసి ఈ ఏడాది ఆమె వింబుల్డన్ టైటిల్ నెగ్గగా... మిక్స్డ్ డబుల్స్లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009, 2012)... బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా 2014 యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది.
    ► మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్లో ఇది 20వ గ్రాండ్స్లామ్ టైటిల్. ఇందులో సింగిల్స్&zwnj;లో ఐదు, మహిళల డబుల్స్లో 11, మిక్స్డ్ డబుల్స్లో నాలుగు ఉన్నాయి. గతేడాది యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్లో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)తో రన్నరప్గా నిలిచిన హింగిస్.. ఈ ఏడాది సానియాతో కలిసి ట్రోఫీని నెగ్గడం విశేషం. హింగిస్కు 2015లో భారత భాగస్వాములతో ఇది ఐదో గ్రాండ్స్లామ్ కావడం గమనార్హం.
    ► ఈ టోర్నీలో బరిలోకి దిగకముందే ష్వెదోవా సెప్టెంబరు 11ను తన వివాహతేదీగా ఖరారు చేసుకుంది. అయితే అనూహ్యంగా ఆమె ఫైనల్కు చేరుకోవడంతో వివాహాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం.