ఐఎస్ వీడియో చూసి.. తల్లిని చంపేసింది

Posted On:16-09-2015
No.Of Views:339

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల హింసాత్మక దృశ్యాల వీడియోను చూసి 15 ఏళ్ల అమ్మాయి తల్లిని హత్య చేసింది. కత్తితో కనీసం 20 సార్లు పొడిచి తల్లిని క్రూరంగా చంపేసింది. డెన్మార్క్‌లో గతేడాది అక్టోబర్ జరిగిన ఈ దారుణ హత్య కేసులో తుది తీర్పు ఇటీవల వెలువడింది. వివరాలిలా ఉన్నాయి. హోల్టెగార్డ్ అనే మహిళా పెయింటర్ తన భర్త జెన్స్, కవల కూతుళ్లతో కలసి నివసిస్తోంది. హోల్టెగార్డ్ కుమార్తె లిసా బోర్చ్కు బక్తియర్ మహ్మద్ (29) అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. బక్తియర్ ఇరాక్ నుంచి శరణార్థిగా డెన్మార్క్‌కు వలస వెళ్లాడు. లిసా, బక్తియర్ సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రేమను హోల్టెగార్డ్ వ్యతిరేకించింది. దీంతో లిసా తల్లితో తరచూ గొడవ పడుతుండేది. ఓ రోజు లిసా బోర్చ్ ఐఎస్ ఉగ్రవాదుల హింసాత్మక చర్యల వీడియోలను చూసింది.  ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న బ్రిటీష్ జాతీయులు డేవిడ్ హేన్స్, అలెన్ హెన్నింగ్ తలలను నరికివేసినప్పటి దృశ్యాల వీడియోను పదే పదే చూసింది. లిసా వెంటనే కిచెన్‌లో కత్తిని తీసుకుని తల్లిని పొడిచేసింది. ఆ తర్వాత లిసా పోలీసులకు ఫోన్ చేసి ఓ వ్యక్తి తన తల్లిని చంపి ఇంట్లోంచి పారిపోయాడని చెప్పి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగుచూసింది. లిసా, బక్తియర్తో ఉన్న సంబంధం గురించి విచారణలో బయటపడింది. మహ్మద్ (29) వేలిముద్రలు హాల్టెగార్డ్ బెడ్రూమ్లో లభ్యమయ్యాయి. ఈ హత్య కేసులో అతను సహకరించినట్టు పోలీసులు భావించారు. కోర్టు లిసా, బక్తియర్ను దోషులుగా నిర్దారించింది. లిసాకు తొమ్మిదేళ్లు, బక్తియర్ 13 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ.. శిక్షణాంతరం బక్తియర్ను దేశ బహిష్కరణ చేయాలని కోర్టు తీర్పు చెప్పింది.